11, సెప్టెంబర్ 2009, శుక్రవారం

మనసారా నవ్వుకుందాం రా !

1. "ఒరేయ్ రామూ, నేను మీ నాన్నగారికి రెండు వేల రూపాయలు అప్పు ఇచ్చి నెలకు రెండు వందలు చొప్పున తీర్చమన్నాననుకో అప్పుడు ఎన్ని నెలలలో నేను ఇచ్చిన అప్పు తీరుతుంది ?" అడిగింది లెక్కల టీచర్.
"అసలు తీరదు మేడం" అన్నాడు రాము.
" ఇంత చెప్పీనా నీ బుర్రకు ఏమీ ఎక్కడం లేదు.నీకు లెక్క అసలు అర్ధమవుతున్నాయా లేవా ? కోపంగా అడిగింది టీచర్.
" మీకే మా నాన్న తత్వం అర్ధం కాదు మేడం. అప్పు చేయడమే గాని తీర్చే బుద్ధి మా నాన్నగారికి అసలు లేదు" అసలు సంగతి చల్లగా చెప్పాడు రాము.


2. " నిన్ను ఇంతకాలం వెంట పడి ప్రేమా దోమా అంటూ వేధించిన ఆ రమేష్ నే పెళ్ళి చేసుకుందామని ఎందుకు నిర్ణయించుకున్నావో ఎంత ఆలోచించినా నాకు అర్ధం కావదం లేదు " అడిగింది రోజా.
" ఇంత కాలం నా వెంటపడి నన్ను వేధించిన ఆ వెధవను పెళ్ళి చేసుకొని ప్రతీకారం తీర్చుకుంటాను. ఇక బ్రతికినంతకాలం వాడి బ్రతుకు కుడితిలో పడిన ఎలకే !క్షణం క్షణం కష్టాలు అనుభవిస్తూ బ్రతుకుతూ చస్తాడు దొంగ వెధవ " అసలు సంగతి చెప్పింది అయేషా.


3. “మా ఇంటికి చుట్టాలు ఎవరొచ్చినా సరే రెండు రోజులకు మించి వుండరు తెలుసా ?” గర్వంగా భుజాలెగరేసుకొని అన్నాడు పాపారావు
“అరే. అలా ఎలా మానేజ్ చేయగలుగుతున్నావురా ? నాకు కూడా కొంచెం చెప్పు. చుట్టాల తాకిడితో చచ్చిపోతున్నాం “ అడిగాడు అప్పుల అప్పారావు.
“ చుట్టాలొచ్చిన దగ్గర నుండీ కాఫీ, టిఫిన్ల తొ పాటు వంట కూడా మా ఆవిడ చేత వండిస్తాను. అంతే ఆమె చేతి వంటకు తట్టుకోలేక రెండు రోజులకే అందరూ పరార్ !” అసలు సంగతి చెప్పాడు పాపారావు.


4. “ఇప్పటికే మీ చూపు చాలా మందగించింది. వెంటనే గుట్కా తినడం మానక పోతే చూపు వెంటనే పోయే ప్రమాదం వుంది. జాగ్రత్త “ కోపంగా అన్నాడు డాక్టర్ దైవాధీనం
“డాక్టర్ గారు. నేను వయసు మళ్ళిన వాడిని. చూడవల్సిన విషయాలన్నింటినీ ఇప్పటికే చేసేసాను. ఇప్పుడు కొత్తగా చూపు పోతే మాత్రం వచ్చే నష్టం ఏముంది గనుక “ నిట్టూరుస్తూ జేబు లో నుండి గుట్కా పాకెట్టు తీసి నొట్లో వేసుకున్నాడు వెంకటాచలం.


5.ఎందుకే ఈ పచ్చడి బండను షో కేసులో పెట్టావు ? ఏమిటి దాని ప్రత్యేకత ? " అడిగింది రాజి.
" నేను కాపురానికి వచ్చిన వారం రోజుల లోనే ఈ పచ్చడి బండకు గుద్దుకొని పడిపోయే మా అత్తగారు టపా కట్టేసింది.నాకు అత్త పోరు లేకుండా చేసింది. అందుకే ఈ పచ్చడి బండ అంటే నాకెంతో ఇష్టం. దానిని అపురూపం గా దాచుకున్నాను." గర్వం గా చెప్పింది రేఖ.



6." ఈ ఆపరేషన్ థియేటర్లో పూల దండ ఎందుకు పెట్టారు సార్ ?" ఆదుర్దాగా అడిగాడు చిన్నారావు.
" ప్రాక్టీస్ మొదలెట్టిన దగర్నుంచీ నేను చేస్తున్న మొదటి ఆపరేషను ఇది.సక్సెస్ అయితే దేవుడికి వేస్తాం. ఫెయిలయితే నీకు వేస్తాం" తాపీగా కళ్ళజోడు సవరించుకుంటూ అన్నాడు డాక్టర్ దైవాధీనం.



7." నేనంటే నా భార్యకు ఈ మధ్య ఎంతో ఇష్టం పెరిగింది." గర్వంగా అన్నాడు రాజు "ఎలా చెప్పగలవు ?" అడిగాడు గోపి.
"అర్ధ రాత్రి ఒంటి గంటకు ఇంటికి వస్తున్నా అంట్లు తోమేందుకు వేడి నీళ్ళు పెట్టి ఇస్తుంది.బొగ్గుపొడికి బదులు నిర్మా ఇవ్వడం మొదలు పెట్టింది.బట్టలు ఉతికెందుకు సబ్బులో నానేసి రెడిగా వుంచుతుంది. అన్నం తినదానికి నేనెంత కష్టపడతానో అని ఏమీ మిగల్చకుండా అని మొత్తం తినేసి గిన్నెలు ఖాళీ చెసేస్తుంది" అసలు సంగతి చెప్పాడు రాజు.


8. "బ్యాంకు వాడి కూతురిని పెళ్ళి చేసుకోవడం చాలా తప్పయిందిరా !" విచారం గా అన్నాడు సూరి.
"ఏమయ్యింది ? మంచి కుటుంబం , బ్యాంకు సంబంధం , ఇక కట్న కానుకలకు లోటు వుండదని అంటూ ఎగిరి గంతేసి చేసుకున్నావుగా పెళ్ళి ?" అడిగాడు రాము.
" అంతా నా ఖర్మకు వచ్చింది.కట్నం గా ఇచ్చిన ప్రతీ వస్తువుపై గోపాలం గారి ఆర్ధిక సహాయం తొ అని రాయించి మరీ ఇస్తున్నాడు మా మామగారు. ఇంటికి వచ్చే వాళ్ల ముందు తలెత్తుకోలేకపోతున్నాను" ఏడుపు ముఖం తో అసలు సంగతి చెప్పాడు సూరి.


9."ఇదివరకు వస పిట్టలా గడ గడ వాగుతుందే వాడివి. ఇప్పుడేమిటి సైలెంట్ గా వుంటున్నావు ?" ఆశ్చర్యంగా అడిగాడు వెంగళ్రావు.
" ఈ మధ్యనే బొలెడు కట్నం తీసుకొని పెళ్ళి చేసుకున్నాను. ఇంక పెళ్ళాం ముందు నోరు విప్పడం కూడానా నా బ్రతుకుకి ? అసలు సంగతి విచారం గా చెప్పాడు తాతారావు.


10."ఈ మధ్య మన చంటాడికి అన్ని మీ బుద్ధులే వస్తున్నాయండీ " అంది మంగ
"ఏం చేస్తున్నాడు ?" ఆశ్చర్యంగా అడిగాడు గవర్నమెంట్ ఉద్యోగి అయిన అప్పారావు.
" లంచం ఇవ్వందే ఏ పని ఆఖరుకి భోజనం కూడా ఫ్రీ గా చెయ్యడం లేదు.పగటి పుట స్కూలులో బెంచీ ముందు కూర్చోని హాయిగా పడుకుంటునాడట. మాస్టారు ఏం అడిగినా తెలీదు తెలీదు అని విసుక్కుంటున్నాడట.ప్రోగ్రెస్ రిపోర్ట్ పై దొంగ సంతకాలు కూడా పెడుతున్నాదట " అసలు సంగతి చెప్పింది మంగ.


11.“ఏయ్ ! హేండ్సప్ ! చేతులు పైకెత్తి స్ట్రైట్ గా నిలబడు, అసలు కదలొద్దు. లేకపొతే షూట్ చేసెస్తాను” రివాల్వర్ చూపిస్తూ అరిచాడు బందిపోటు దొంగ భీమారావు.
“ చేతులు నొప్పిగా వున్నాయి ,అస్సలు పైకెత్తలేను, ఏం చేస్తావో చేసుకో? “ ఆసక్తిగా అన్నాడు రాజారావు
“ చెప్పిన విధం గా చెసి నన్ను కన్ ఫ్యూజ్ చెయ్యకుండా కాస్త కోపరేట్ చెయ్యవయ్యా బాబూ ! నాకసలే ఈ వృత్తి కొత్త. నీలాంటి పెద్ద మనుష్యులు కాస్త సహాయం చెసి నాకు కాంఫిడెన్స్ ఇవ్వాలి లేకపోతే ఈ వృత్తిలో రాణించలేను” అసలు సంగతి చెప్పాడు భీమారావు.


12.“ ఆ దొంగ బస్సులో అంత రష్ లో నీ జాకెట్లో చెయ్యి పెట్టి పర్సు కొట్టెస్తుంటే చూస్తూ ఎలా ఊరుకున్నావే ? గట్టిగా కేకలు పెట్టి వాడిని పట్టించక పొయ్యావా ?” ఆశ్చర్యం గా అడిగింది రేఖ
“ ఆ దొంగ వెధవ జాకెట్లో చెయ్యి పెట్టింది పర్సు కోసమని నేను అనుకోలేదు, అందులే అరవలేదు” అసలు సంగతి ఐస్ క్రీం తింటూ తాపీగా చెప్పింది సృజన.


13." నేను రోజుకు ఆరేడు కవితలు రాసి పారేస్తుంటాను తెలుసా !" గర్వం గా చెప్పాడు అభ్యుదయ కవినని చెప్పుకొనే కామేశ్వరరావు.
" రాసి అవతల పారేస్తేనే మంచిది. వాటిని పత్రికలకు పంపించడం, రేడియోలలో , కవితా గోష్టులలో చదవడం చేస్తే మెదడు వాపు వ్యాధులు గట్రా వచ్చే ప్రమాదముంది." అసలు సంగతి చెప్పాడు రవీంద్ర.


14."నాకూ మా ఆవిడకు గొడవ వస్తే కొద్ది నిమిషాలలోనే సమసిపోతుంది తెలుసా !" కాలర్ ఎత్తుకొని గర్వంగా అన్నడు వాలేశ్వరరావు.
" అరే మీరెంతో గ్రేట్ రా! ఆ కిటుకేదో నాక్కూడా చెప్పకుడదా. మా ఇద్దరి మధ్య గొడవ గనుక లేస్తే గంటలకు గంటలు నడుస్తుంది" దీనంగా అడిగాడు పిచ్చేశ్వరరావు.
"ఏముంది, వెరీ సింపుల్. గోడవ మొదలైన వెంటనే మా ఆవిడకు దొరకకుండా నేను మంచం కిందకు దూరిపోతాను. నన్ను పట్టుకోలేక ఆ అప్పడాల కర్రను అవతల పారేసి మా ఆవిడ వెళిపోతుంది. ఆ తర్వాత నేను తాపీగా బయటకు వచ్చి ఆవిడ కోపం తగ్గేవరకు కాళ్ళు పట్టుకునే వుంటాను.అంతే ! ఆవిడ ఐసైపోయి నన్ను క్షమించేస్తుంది." అసలు సంగతి చెప్పాడు వాలేశ్వరరావు.


15. మొగుడూ పెళ్ళాళయిన సీతా, రామారావు ఒకరోజు తీవ్రం గా గొడవ పడ్దారు. ఎప్పటికీ మొగుడు కాళ్ళు పట్టుకోకపోవడం వలన గబ గబ కొన్ని బట్టలను సర్దేసి బయటకు నడవబోతోంది సీత.
" ఎక్కడికి పోతున్నావు ? " అడిగాడు రామారావు.
" నరకానికి" విసురుగా సమాధానమిచ్చింది సీత.
అయితే నిన్ను నాకు తగిలించి అక్కడకు పోయిన నా అత్తమామలకు నా నమస్కారాలు చెప్పు" వ్యంగ్యం గా అన్నాడు రామారావు.


16. డాక్టర్ గారూ. తీవ్రమైన అలసటగా వుంటోంది. దయచేసి టేస్టు చెయ్యండి" అడిగాడు సుబ్బారావు.
డాక్టర్ అన్ని పరీక్షలు చేసి "మీరు చాలా వీక్ గా వున్నారండి. ఈ మందులను వాడండి క్రమం తప్పకుండా వాడండి, దానితీ పాటు బాగా రెస్టు తీసుకొండి" అని ప్రిస్క్రిప్షన్ రాసి ఇచ్చాడు.
" ఓ కె డాక్టర్ అయితే రేపట్నుంచి ఆఫీసుకు వెళ్ళడం ప్రారంభిస్తాను.అక్కడయితే పగలు కూడా బాగా నిద్రపోవచ్చు" అని భారం గా అడుగులు వేస్తూ వెళ్ళిపోయాడు సుబ్బారావు.
"ఆ అంటూ నోరు తెరుచుకొని వుండిపోయాడు డాక్టర్.

1 కామెంట్‌: